[ Written By Phanindra ]
నేడు మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు.. శీతోష్ణస్థితి మార్పు. దీనికి ప్రధాన కారణం భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అని 1990లో తొలిసారిగా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్(ఐ.పి.సి.సి) తన మొదటి నివేదికలో పేర్కొంది. అయితే ఈ భూతాపానికి ముఖ్యమైన మానవజనిత కారణం..హరిత గృహ వాయువులు (మరీ ముఖ్యంగా కార్బన్ ఉద్గారాలు)..
ఇటీవల ఐ.పి.సి.సి(ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్) రిపోర్ట్ అనుసరించి, భూతాపాన్ని అరికట్టేందుకు మానవాళికి కేవలం ఇంకో దశాబ్దం మాత్రమే మిగిలి ఉంది.2010 నాటి ఉద్గారాల స్థాయిలో 2030 నాటికి 45 శాతం , 2050 నాటికి సున్నా శాతానికి తగ్గుదల జరగాలి. ఒకవేళ ఈ లక్ష్యాలను చేరుకోలేకపోతే, అత్యంత జనసాంద్రత కలిగిన ఉష్ణమండల ప్రాంతాలు, ద్వీప దేశాలు తీవ్రమైన శీతోష్ణస్థితి ప్రభావాల్ని ఎదుర్కోవలసి వస్తుంది.
అభివృద్ధి చెందిన మరియు ఇతర పారిశ్రామిక దేశాల జీవన శైలి ఎంపికలు మరియు చారిత్రాత్మకంగా పారిశ్రామీకీకరణ ప్రగతి వలన అత్యధిక కార్బన్ ఉద్గారాలు వెలువరించడం ద్వారా భూతాపానికి కారకులు అయ్యారు.కానీ భూతాప ప్రభావానికి తీవ్రంగా బలి అవుతోంది మాత్రం..తక్కువ అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న ద్వీప దేశాలు. కానీ దురదృష్టవశాత్తు ఈ దుష్పరిణామాలను అరికట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఒక న్యాయబద్ధమైన ప్రయత్నాలు మాత్రం జరగటం లేదు. ఈ పెను ఉత్పాతాన్ని నివారించేందుకు అన్ని దేశాలు నడుం బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ఈ ప్రణాళిక/ఒప్పందం సి.బి.డి.ఆర్( కామన్ బట్ డిఫరెన్స్యేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ) అను సూత్రంపై ఆధారపడి జరగాలి. అంటే దేశాల యొక్క తలసరి ఉద్గారాలు ఆధారంగా న్యాయమైన రీతిలో ఈ భాధ్యతల్ని పంచుకోవాలి.
ప్రపంచ భేదాత్మక కార్బన్ పన్ను:
క్యోటో ప్రోటోకాల్ ను అనుసరించి తక్కువ తలసరి కార్బన్ ఉద్గారాలు వెలువరిస్తున్న దేశాల బాధ్యతల్ని పంచుకునేందుకు 'కార్బన్ ట్రేడింగ్' అను మార్కెట్ ఆధారిత విధానం అమలులో ఉన్నప్పటికీ, దాని అమలులో అనేక లోపాలున్నాయి. అందువలన ప్రత్యామ్నాయంగా అమలుచేయబడే 'ప్రపంచ భేదాత్మక కార్బన్ పన్ను' విధానం అనేది'న్యాయమైన శక్తి పరివర్తన' అనే సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.
ఈ భూగోళం భావి తరాలకు నివాసయోగ్యంగా ఉండాలంటే మొట్టమొదట చేయవలసిన కార్యక్రమం..శక్తి రంగంలో మౌలిక సదుపాయాల కల్పన.కానీ ఈ హరిత శక్తివనరుల ( పర్యావరణహిత శక్తి వనరులు) అభివృద్ధికై భారీగా పెట్టుబడులు అవసరం. ప్రపంచ వ్యాప్తంగా భారీ నిధులని సమకూర్చడానికి ఒక నూతన ప్రపంచ భేదాత్మక కార్బన్ పన్నును విధించవలసిన అవసరం ఉంది.
ప్రతీ దేశం విజయవంతంగా సంప్రదాయ శక్తి వనరుల నుండి హరిత శక్తివనరుల వైపు పరివర్తన చెందడానికి ఆ దేశ 'స్థూల దేశీయోత్పత్తి' లో సుమారు 1.5% నిధులను వెచ్చించాల్సి వస్తుంది. ఈ భారీ నిధులని తలసరి కార్బన్ ఉద్గారాలు అధికంగా గల అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలు కార్బన్ పన్ను రూపంలో చెల్లించడం ద్వారా తక్కువ తలసరి కార్బన్ ఉద్గారాలు గల అల్పాభివృద్ధి దేశాల శక్తి పరివర్తన మౌళిక సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయాల్ని భర్తీ చేయాలి. ఏ దేశం ఎంత కార్బన్ పన్ను చెల్లించాలి అనేది ' ప్రపంచ సగటు తలసరి కార్బన్ ఉద్గారాలు' ( 4.97 మెట్రిక్ టన్నుల CO2) తో పోల్చినపుడు ఆ దేశ తలసరి ఉద్గారాల పరిమాణం కు అనుగుణంగా ఉంటుంది.
ప్రపంచ కార్బన్ ఉద్గారాల తగ్గింపులో పాత్ర:
◆ అధిక ఉద్గారాలు వెలువరించే దేశాలు అధిక కార్బన్ పన్నును చెల్లించవలసి రావడంతో..తమ దేశ కార్బన్ ఉద్గారాల తగ్గింపుకై తీవ్రంగా కృషి చేస్తాయి.
◆ఈ కార్బన్ పన్ను వసూలు ద్వారా వచ్చే నిధులని ఆయా దేశాలు హరిత శక్తి వనరుల వైపు పరివర్తన చెందడానికి దోహదం చేస్తాయి.
◆ తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే ఆధునిక సాంకేతికతల పరిశోధన, అభివృద్ధి, బదిలీ కి ప్రోత్సాహం లభిస్తుంది.
◆శీతోష్ణస్థితి మార్పుల ప్రభావానికి తీవ్రంగా గురైన పేద మరియు చిన్న ద్వీప దేశాలకు కొంతవరకు ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది.
◆ కేవలం అల్పాభివృద్ధి చెందిన, పేద దేశాలు మాత్రమే కాకుండా తక్కువ తలసరి కార్బన్ ఉద్గారాలు వెలువరించే స్వీడన్, స్వీట్జర్లాండ్ వంటి కొన్ని అభివృద్ధి చెంది అధిక ఆదాయ దేశాలు సైతం దీని వలన లబ్దిపొందే అవకాశం ఉంది.
◆ భారతదేశం యొక్క జనాభా మరియు తక్కువ తలసరి కార్బన్ ఉద్గారాలు(1.73 మెట్రిక్ టన్ CO2) వలన అత్యధిక లబ్ది చేకూరే అవకాశం ఉంది. ఈ నిధుల్ని శుద్ధ సాంకేతికతల పరిశోధన, అభివృద్ధికి వెచ్చించవచ్చు.
ముగింపు:
ప్యారిస్ ఒప్పందం తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఇటీవల అమెరికా వైదొలగడం, గ్రీన్ క్లైమేట్ ఫండ్ కి ఇవ్వ వలసిన 100 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు అనేక అభివృద్ధి చెందిన దేశాలు విముఖత చూపించడం, ఆర్థికాభివృద్ధి పేరుతో ఈ భూగోళానికే ఊపిరితిత్తుల వంటి అమెజాన్ అడవుల విచక్షణారహిత వినాశనానికే మొగ్గుచూపుతున్న బ్రెజిల్ ప్రభుత్వం, ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఎంతో ఆర్థిక భారం కానున్న ప్రపంచ భేదాత్మక కార్బన్ పన్ను అమలు కష్టసాధ్యమే..
" చివరి చెట్టు నరకబడినప్పుడు,
చివరి చేపను పట్టుకున్నపుడు, చివరి నది విషతుల్యం అయినపుడు మాత్రమే..మనిషి డబ్బును తినలేడని గ్రహిస్తాడు.."