నేను పుట్టింది చిత్తూరు జిల్లా, మదనపల్లి. మా నాన్నగారి పేరు యన్. రెడ్డప్ప రెడ్డి, మా అమ్మగారి పేరు కృష్ణ వేణి. అమ్మ, నాన్న ఇద్దరూ రైతు కుటుంబాలకు చెందినవారు. మా నాన్నగారు ZPHS హైస్కూల్ హెడ్ మాస్టర్ గా పని చేశారు. GRT హై స్కూల్ లో 10వ తరగతిదాక చదివి ఇంటర్ B.T కళాశాలలో చదివాను.
నేను కె.ఎస్.ఆర్.ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో పట్టబద్రుడినయ్యాక శ్రీకృష్ణదేవరాయ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఎంబిఏ చేశాను. ఎంబిఏలో నేను యునివర్సిటీ టాపర్ గా నిలిచి గవర్నర్ చేతులుమీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నాను. విద్యార్ధిగా ఉన్నప్పుడు నాకొక కల ఉండేది. రాయలసీమలో ఎప్పుడూ కరువులు, కష్టాలు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు స్థాపించి ఈ ప్రాంతం వారికి ఉద్యోగాలు కల్పించి వారికి జీవనోపాధి కల్పించాలి అని కల కనేవాడిని. అయితే నా దగ్గర పెట్టుబడి లేదు. అనుభావం కూడా లేదు. మొదట అనుభవం సంపాదించాలనుకున్నాను. విశాఖపట్నంలోని BHVPలో మేనేజ్ మెంట్ ట్రెయినీగా జాయిన్ అయ్యాను.
ఆ సమయంలో ఒకసారి ఆ కంపెనీ ఎం.డీ.తో మాకు ఇంటరాక్టివ్ సెస్సన్ ఉన్నది. అప్పుడు నేనడిగాను “బాగా ఎఫిషియంట్ గా పని చేస్తే ఎన్ని సంవత్సరాలలో ప్రమోషన్ వస్తుంది” అని. దానికి అతనన్నాడు “ఇక్కడ ఎఫిషియన్సీ బేస్ మీద ప్రమోషన్లుండవు. నిర్ణీత కాలం తరువాత అందరికీ ఒకే విధంగా వస్తాయి” అని. అప్పుడు నాకర్థమయింది నేను ఇంజినీర్, నాపైన సీనియర్ ఇంజినీర్, డిప్యుటీ మేనేజర్, మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. మహా అయితే ముప్పై ఏళ్ళు పనిచేస్తే అడిషనల్ GM గానో లేకపోతే GM గానో రిటైర్ అవుతాను. అదే నేను IAS అయితే డైరెక్ట్ గా M.D. కావచ్చు. అప్పుడే నిర్ణయం తీసుకున్నాను IAS కావాలని.
ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కి అప్లై చేశాను. ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్ కు ప్రిపరేషన్ కోసం సెలవు దొరకలేదు. అందుకే నాకు బాగా గ్రిప్ సబ్జెక్ట్స్ అయిన మేనేజ్ మెంట్ మరియు స్టాటిస్టిక్స్ లో ఉద్యోగం చేస్తూనే సొంతంగా ప్రిపేర్ అయి డైరెక్ట్ గా హైదరాబాద్ వెళ్ళి మెయిన్స్ రాశాను.
నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఆనందానికి హద్దులులేవు. ఇంటర్వ్యూ బాగానే చేశాను. ఐదు మార్కులలో సర్వీస్ మిస్ అయ్యింది. BHPVకి రాజీనామా చేశాడు. అశోక్ నగర్ లో రూము తీసుకొని ఒక యజ్ఞం లాగ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. రాత్రనక, పగలనక పుస్తకాలే ప్రపంచంగా బతికాను. అయితే అదృష్ట లక్ష్మి నన్ను అప్పటికే వీడింది. ఒక్కో సారి ఒక్కో ఆప్షనల్ దెబ్బ తీసింది. మా నాన్న నెల నెలా డబ్బు పంపినా తీసుకోడానికి సిగ్గుగా ఉండేది. ఎప్పటికయినా సివిల్స్ వస్తుంది లేక రిక్త హస్తాలతో నిలిచిపోవాలా అని బెంగగా ఉండేది. మానసికంగా ఎంతో అలజడిని ఎదుర్కొంటున్న ఆరోజులలో గ్రూప్-1 నోటిఫికేషన్ పడింది. అది జన్మకో శివరాత్రి లాంటిది. ఎప్పుడు పడుతుందో ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయో తెలియదు. అయితే గ్రూప్-1 అలవోకగా పాస్ అయ్యాను.
గ్రూప్-1 అధికారిగా ఉత్తీర్ణుడను అయ్యాక 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్నాక నేను కడపలో OSD(DCCB)గా బాధ్యతలు స్వీకరించాను. ఎక్కడయితే ఇంజనీరింగ్ చదివానో, ఏ ప్రాంతమంటే నాకు అత్యంత ఇష్టమో అక్కడే ఉద్యోగ భాద్యతలు చేపట్టడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.
అప్పుడు కడప కలెక్టర్ గా P. సుబ్రహ్మణ్యం గారు పనిచేసేవారు. వీరిని నేను అతి గొప్ప వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు గల IAS ఆఫీసర్ గా గౌరవిస్తాను. డిసిసిబి బ్యాంక్ లో వీవర్స్ సొసైటీలలో 10 కోట్లకు పైగా రుణాలు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని తెలుసుకొని దానిపై కలెక్టర్ గారు ఎన్ క్వయిరీ వేశారు. దీనికి నన్ను ఎన్ క్వయిరీ అధికారిగా నిర్ణయించారు. ఈ స్కాంలో ఎంతో మంది ఉద్యోగులు, రాజకీయ నాయకులు, ఫ్యాక్షనిష్టులు ఉన్నారు. ఒక రోజు కలెక్టరు గారు నన్ను పిలిచి ‘జమ్మలమడుగు వెళితే నీపై ఫ్యాక్షనిష్టులు దాడి చేస్తారని నిఘా వర్గాల సమాచారముంది’ అని చెప్పారు. అప్పుడు నేను ‘సార్ నాకేమీకాదు. టైం అండ్ స్పాట్ చెప్పి మరీ వెళ్తాను’ అని చెప్పి వెళ్లాను. ఈ ఎన్ క్వయిరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసెంబ్లీలో పెద్ద చర్చ జరిగింది.
నన్ను కూడ DCC బ్యాంక్ నుంచి బదిలీ చేసి చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా నియమించారు. బాల్యం కోల్పోయి అత్యంత హానికరమయిన పనులలో మగ్గిపోతున్న పిల్లలకోసం ఏదైనా చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఈ సమస్య పరిష్కారం కోసం ఏడు విధాలుగా ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను.
దాదాపు 2000 మంది బాల కార్మికులను బీడీలు చుట్టడం, గనుల్లోనూ, పత్తి మిల్లులలోనూ పని చేయడం లాంటి హానికరమయిన పనులనుంచి తప్పించి, వారి కోసం ప్రత్యేకంగా 40 పాఠశాలలు స్థాపించి వాటిలో విద్యనభ్యసించేలా చేశాను. ఒక వ్యక్తిగా నేను ఇంత పని చేయగలిగేవాడిని కాదు, గ్రూప్ - 1 అధికారిగా ఉండటం వలననే ఇది సాధ్యమయింది.
అప్పుడు ఉమేష్ చంద్ర IPS కడప SP గా ఉండేవారు. అతను నేరస్థులకు సింహ స్వప్నంలా ఉండేవాడు. అతని సహాయంతోనూ మరియు ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ మరియు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ లేబర్ ల సహాయంతో బాల కార్మికులను ఉపయోగించుకొనే గనుల మీద, ఫాక్టరీల మీద దాడులు చేసి అక్కడ పని చేసే పిల్లలను ప్రత్యేక పాఠశాలలో చేర్పించాను. బాలకార్మికుల కోసం పని చేసిన ఆ రెండు సవంత్సరాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి.
అదే సమయంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ చైల్డ్ లేబర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించాను. అంధులు, అవిటివారు, బదిరులు, మానసిక వికలాంగులు అయిన బాలలకు సేవ చేసే భాగ్యం నాకు అప్పుడు కలిగింది. ఆ ఉద్యోగానికి సంబంధించి మూడు సంఘటనలు నాకెప్పటికీ చెరగని ముద్ర వేశాయి.
ఒకసారి స్కూల్ బ్యాగ్ చేత పట్టుకొని ప్రాకుతూ స్కూలుకెళుతున్న యుక్తవయసు అమ్మాయిని చూశాను. నా మనసుకు ఎంతో బాధించింది, అలాంటి వారి కోసం ఏదయినా చేయాలనుకున్నాను. దాతల సహాయంతో అవిటి వారికి ముఖ్యంగా విద్యార్థులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేయించాను. కొంత కాలం తరువాత అవిటివారయిన ఆ విద్యార్థినుల హాస్టల్ వెళ్ళాను. వాళ్ళు బెలూన్లలో చెంకీలు పెట్టి నేను అక్కడికి వెళ్తూనే కడ్డీతో వాటిని గుచ్చి నా మీద చెంకీలు పడగానే ఆనందంతో కేరింతలు కొడుతూ వారి ఆప్యాయతను, ప్రేమ నాపైన చూపించారు.
కడపలో ఒక అంధ పాఠశాల ఉంది. దాన్ని చుస్తే ప్రభుత్వానికి వికలాంగులంటే ఎంత నిర్లక్ష్యమో కళ్లున్న వారికెవరికయినా అర్థమవుతుంది. వారికి నేత్ర నిధి కోసం పాటు పడ్డాను. అక్కడ సాంబశివుడు అనే ఒక గొప్ప గాయకుడు ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. అతనికి కూడా చూపులేదు. అతనిని తరచుగా కలసి అతని పాటలతో మైమరచి పోయేవాడిని.
ఒకసారి నేను వై.వీ. స్ట్రీట్ లో ఎవరితోనో మాట్లాడుతూ వెళ్తూ ఉంటే అంత రణగొణ ధ్వనులలోనూ నా మాట విని నన్ను గుర్తించి 'రవి శేఖర్ రెడ్డి సార్, రవి శేఖర్ రెడ్డి సార్' అంటూ కొంత మంది అంధ విద్యార్థులు ఉరుక్కొంటూ నాదగ్గర కొచ్చి నన్ను పట్టుకున్నారు. నా హృదయాన్ని ద్రవింప జేసిన ఆ సంఘటన నేను ఎప్పటికీ మరవలేను.
పిల్లలకు స్పోర్ట్స్ డే కోసం కేవలం ఐదు వేల రూపాయల బడ్జెట్ ఉండేది. నేను దాతల సహాయంతో దాదాపు రెండు వేల మంది వికలాంగులైన విద్యార్థులకు రెండు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించాను. మూడు పూటలా మంచి భోజనాలు ఏర్పాటు చేశాను. ఆ పిల్లల ఆనందం ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఈ కార్యక్రమానికి సిరాజుద్దీన్ మరియు అబ్దుల్ హాక్ అనే దాతలు ఎంతో సహకరించారు. ఇండస్ట్రియలిస్టు అయిన హాక్ గారు రాత్రి దోమలు కుడుతున్నా అదే స్టేడియంలో నిద్ర పోయారు. కంక్లూడింగ్ సెరిమనీ అప్పుడు కలెక్టర్ మరియు మినిస్టర్ వచ్చారు. హాక్ గారిని సన్మానించాలని నేను అతనిని పిలవమని చెప్పాను. అప్పుడతను 'పిల్లలకు భోజనాలు పెడుతూ, వారు తిన్నాక ఇస్తరాకులు ఎత్తేస్తూ ఉన్నారు. సన్మానం చేస్తాం రమ్మని పిలిస్తే' నేనిక్కడ పిల్లలకు భోజనాలు పెడుతున్నాను రాలేను' అన్నారు. అప్పుడు నాకు గాంధీ మహాత్ముడు గుర్తొచ్చాడు. అందరూ ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే గాంధీజీ మాత్రం నావకాళీలో హిందువులు ముస్లింలు ఒకరినొకరు నరుక్కోకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన ఎప్పుడు గుర్తొచ్చినా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. దాదాపు రెండు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకు ఎనలేని సేవ చేసిన హాక్ గారికి వెళ్తున్నపుడు నమస్కరించి ధన్యవాదాలు చెపుతుంటే అతను దానికి ఒప్పుకోకుండా ఇంతటి అవకాశం ఇచ్చిన మీకే నేను రుణపడి ఉంటానని చెప్పారు.
నేను దేవుడిని నమ్మను, అంటే ... అందరూ అనుకుంటున్నట్లు గుడిలో శిలా రూపంలోనో, వైకుంఠం లేదా కైలాసంలోనో లేదా ఒక వెలుగు లాగా అందనంత ఎత్తున ఆకాశంలోనో ఉంటాడని నేననుకోను. దేవుడు ప్రతి జీవిలోనూ ఉంటాడని నా నమ్మకం. అయితే అహంకారం, స్వార్థం 'అనేవి నేను వేరు , వారు వేరు' అన్న భావాన్ని కలిగిస్తుంది. అయితే హాక్ లాంటి కొంత మంది నిస్వార్థ పరుల సన్నిధిలో నాకు దైవ సన్నిధిలో ఉన్నట్లనిపిస్తుంది.
నేను స్కూల్ లో చదువుకొనే రోజులలో చాలా ముసలి అయిన బిచ్చగత్తె మా ఇంటికి రోజూ వచ్చి మా ఇంట్లో ఏమయినా మిగిలి పోయి ఉంటే తినేది. కొంత కాలం తరువాత వచ్చే శక్తి కుడా లేక సంతలో ఒక చెట్టుకింద ఉండేది. మా అమ్మ నాతో ప్రతిరోజూ తలంటుకోవడానికి నూనె, తినడానికి దోశలు కానీ, ఇడ్లీలు కానీ ఇచ్చి పంపేది. అప్పుడు నా కర్తమయ్యేది కాదు, కానీ తరువాత తెలిసింది ఇలాంటి వారికి మనం పెట్టే అన్నం దేవుడు స్వీకరిస్తాడు కానీ గుడిలో పెట్టే లడ్డు, చక్కర పొంగలి కాదు అని.
అప్పటి కలెక్టర్ వీణా ఈష్ నన్ను అన్ని ముఖ్యమైన పనులలో వినియోగించుకునేవారు. పదో తరగతి పరీక్షల సమయంలో నన్ను స్పెషల్ స్క్వాడ్ లాగ నియమించారు. ఎలక్షన్లలో జోనల్ ఇన్ ఛార్జ్ గా, DSC పరీక్షలలో పరీక్షా పత్రం తయారు చేయడానికి, ప్రజల వద్దకు పాలనకు నోడల్ అధికారిగా ....... ఇలా ప్రతిదానిలో నా సేవలు వినియోగించుకొనేవారు.
నేను అప్పుడు అధికారులకు క్రీడలు నిర్వహించేవాడిని. SP ఉమేష్ చంద్ర గారికి క్రికెట్ అంటే ఇష్టం. మేము తరచూ క్రికెట్ మ్యాచ్ లు పెట్టుకొనేవారం. అంత మంచి అధికారిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా అతనికి సెక్యూరిటీ ఇవ్వలేక పోవడం నాకు ఎంతో బాధ కలిగించింది.
జిల్లా స్థాయి అధికారిగా ఉండటంతో అధికారులతోనూ, ప్రజలతోనూ, పత్రికాప్రతినిధులతోనూ, రాజకీయ నాయకులతోనూ తరచూ ఇంటరాక్షన్ ఉండేది. జిల్లా అధికారులకు ముఖ్యమైన బాధ్యత ఎన్నికలు సక్రమంగా నిర్వహించడం. నన్ను రాయచోటి నియోజక వర్గంకి అడిషనల్ రిటర్నింగ్ అధికారిగా నియమిoచారు. ఎన్నికల రోజు ఒక ఎక్స్ ఎం.పి. మద్యాహ్నం నుంచి పాత రాయచోటిలో రిగ్గింగ్ చేస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఆ విషయం తెలిసినప్పుడు నేను వారి ప్రత్యర్థితో ఉన్నాను. అతనికి ‘ఇలా రిగ్గింగ్ జరుగుతోందట’ అని చెబితే పాత రాయచోటి అతని ఏరియానే కదా, ఇది మామూలుగా జరిగేదే అన్నాడు. అప్పుడు నేను ‘ఇండియాలో ఎవరికీ ఏ ప్రాంతం పైనా గుత్తాధిపత్యం లేదు, ఎవరికి ఓటు వెయ్యాలో ప్రజలే నిర్ణయిస్తారు’ అని చెప్పి, అక్కడికి వెళ్లి ప్రిసైడింగ్ అధికారితో ఈ విషయాన్ని నోట్ చేయిoచి రిగ్గింగ్ చేయించిన వ్యక్తిని అర్ధ గంటలో అరెస్ట్ చేయించి జైలులో పెట్టించాను. ఈ విషయమై నా పై అధికారిగా ఉన్న ఎ. గిరిధర్ IAS నుంచి కూడా మౌకిక ఆదేశం పొందడం జరిగింది.
మరొక్కసారి జమ్మలమడుగు పంచాయితీకి ఎన్నికలు జరిగాయి. దాన్ని అన్ని పార్టీలు ప్రిస్టేజ్ ఇస్యుగా తీసుకున్నారు . అధికారులం కూడా అంతే ప్రిస్టేజ్ ఇస్యు తీసుకున్న సజావుగా జరిపించాలని. నలుగురు ఎమ్మెల్యేలు ఏజెంట్లుగా కుర్చున్నారంటే అదెంత ముక్యమో మీకర్ధమయ్యే ఉంటుంది. ఒక రూంలో ఏజెంట్ గా Y.S.R గారే స్వయంగా ఉన్నారు. నేను మొత్తం ఎన్నికలకు ఎలక్షన్ అధికారి హోదాలో అన్ని పోలింగ్ బూతులూ చెక్ చేస్తూ YSR ఉన్న గదికి కూడా పోయాను. అప్పుడు వారితో దాదాపు గంట సేపు ఎన్నో విషయాలు మాట్లాడం జరిగింది. వారు తనకోసం తెచ్చుకున్న టిఫెన్ నాతో షేర్ చేసుకున్నారు .
YSR తో మాకు ప్రత్యక్ష సంబంధం తక్కువే ఉండేది. ఎందుకంటే వారి తరుపున వారి సోదరుడు వివేకానంద రెడ్డిగారు నాతో కలవడం, ప్రజల సమస్యలు పరిస్కారం చేయడం జరిగేది. రాజగోపాల్ రెడ్డిగారు, బద్వేల్ వీరా రెడ్డిగారు, వీరశివారెడ్డిగారు, ద్వారకనాద రెడ్డి గారు, తులసిరెడ్డి గారు, వేంపల్లి సతీష్ రెడ్డిగారు, ఇలా ముఖ్య నాయకులంతా, ఒక్కోసారి వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి రూల్స్ అనుమతించవని చెప్పినప్పుడు నన్ను అర్థం చేసుకుని నాకు సహకరించేవారు. నేను అమెరికా వెళ్లి పోయిన తరువాత అట్లాంటా లోని ఆటా (ATA) సమావేశాలకు పోయినప్పుడు ప్రొద్దుటూరు ఎమెల్యే వరదరాజుల రెడ్డిగారు నన్ను చూసి ఆప్యాయంగా పలకరించి ‘మీ లాంటి మంచి అధికారులు అమెరికా వచేస్తే ఎలా సార్, తిరిగి వచ్చేయండి అని అన్నారు.
ఆ తరువాత హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ ఆఫీసులోని వాతావరణం నాకు నచ్చలేదు. పని కూడా సంతృప్తికరంగా అనిపించలేదు. అప్పుడు నేను అమెరికా వెళ్ళి అక్కడ శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిగిన అభివృద్ధి తెలుసుకొని తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను.
అమెరికాలో వెళ్ళాక లర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టం(LMS) అభివృద్ధి చేయడం కోసం మిడిల్ టైర్ కాంపోనెంట్స్ డెవలప్ చేశాను. ఈ - లర్నింగ్ రంగంలో దాదాపు మూడు సవంత్సరాలు పని చేశాను. ఆ తరువాత జనరల్ మోటర్స్ లో సీనియర్ కన్సల్టెంట్ గా ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫీస్ లో చాలాకాలం పని చేశాను.
నేను వెళ్ళిన పని అయిపోయింది. టెక్నాలజీలో పట్టుదొరికింది. జీవితానికి కావలసిన డబ్బు సంపాదించుకున్నాను, నా పిల్లలు అమెరికా సంస్కృతి నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు.
ఇండియా వచ్చాక రెండు, మూడు వ్యాపారాలు చేశాను, చేతులు కాల్చుకున్నాను. ఆ సమయంలో నాతో పాటు గ్రూప్ -1 ఆఫీసరైన ఒక మిత్రుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఒక ఆన్ లైన్ పోర్టల్ స్టార్ట్ చేద్దామని చెప్పాడు, ఆ ఆలోచన నాకు నచ్చింది.
నాకు గ్రూప్ -1 , గ్రూప్ - 2 లాంటి ఉద్యోగాలు ఎలా సాధించాలో తెలుసు అలాగే ఈ రంగంలో లేటెస్ట్ టెక్నాలజీ ఏమిటో తెలుసు, ప్రిడక్టివ్ అనలిటిక్స్ కు ప్రెసిషన్ అప్రోచ్ ను జత చేశాను.
దాదాపు 30 మందితో ఒక టీమ్ తయారు చేసుకున్నాను, పాత పరీక్షలకు సంబంధించి 20 వేల ప్రశ్నలు సేకరించి వాటిని పారామీటరైజ్ చేయించాను. ప్రతి అభ్యర్థి తానెక్కడున్నాడో తెలుసుకోగలిగేలా ఒక సాఫ్ట్ వేర్ తయారు చేయించాను. రూట్ మ్యాప్ ఏరియా మైల్ స్టోన్స్ ఏర్పరచుకొని గమ్యం సాధించేలాగా వ్యూహరచన చేసుకొనే సదుపాయం కలిగించాను.
మా అప్రోచ్ విజయం సాధించడం మొదలైంది. గ్రూప్ - 2 ప్రిలిమ్స్ లో 150 కి 100 ప్రశ్నలు మావే వచ్చాయి, సాక్షి లో వచ్చిన స్టేట్ వైడ్ న్యూస్ పెద్ద సంచలనం కలిగించింది. మెయిన్స్ లో మావి 200 ప్రశ్నలు వచ్చాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పేపర్ లో నూటికి 80 ప్రశ్నలు మా టెస్ట్ సిరీస్ నుంచి రావడం మాకే ఆశ్చర్యం కలిగించింది.
మా ఉద్యోగికి తెలంగాణలో గ్రూప్ - 1 వచ్చింది. ఎంతో మందికి AP లో గ్రూప్ - 2 వచ్చింది. అయితే ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవలసివచ్చింది. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్న ఒక మంచి లక్ష్యం కోసం ముందుకుపోవాలని నిర్ణయించుకున్నాక వెనుకడుగువేయడం సరి కాదు.
1) అత్యధిక సంఖ్యలో విద్యార్థులకు ఉద్యోగాలు లభించేలాగా సహకరించడం.
2) జాతీయ స్థాయి పరీక్షలు తెలుగులో నిర్వహించేలాగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అవసరం అయితే సుప్రీం కోర్ట్ లో న్యాయ పోరాటం చేసి ప్రాంతీయ భాషపై ఉండే వివక్షను పోగొట్టి తెలుగువారికి ఉద్యోగావకాశాలు కలిగించడం.
మీ అందరి సహకారంతో ఈ విషయాలలో నా లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాను.
© 2016, Precisionacademy.in, All rights reserved
Precision Academy